పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-04 ధన్నాసి సం: 03-016 అధ్యాత్మ

పల్లవి:

ఊరకే నీ శరణని వుండుటే నా పనిఁ గాక
యీ రీతి నా వుపాయము లేడ కెక్కీనయ్యా

చ. 1:

ముందే అంతర్యామివై మొగి నాలో నుండఁగాను
చెంది నిన్ను లేనివానిఁ జేసుక నామనసులో
గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా
ఇందుఁ గల్పితధ్యానము లెట్టు చేసేనయ్యా

చ. 2:

కన్నులఁ జూచినందెల్ల కమ్మి నీవై యుండఁగాను
అన్నిటాఁ బ్రత్యక్షమందు అభావన చేసుకొని
విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు
పన్నిన ప్రయాసాలఁ బడనేటికయ్యా

చ. 3:

శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతివై కొలువుండి
ఆవటించి తలఁపులో నచ్చొత్తి నట్టుండఁగాను
దేవుఁ డెట్టివాఁడంటా తెగని చదువులందు
సోవలుగా నింకనేమి సోదించేనయ్యా