పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-05 రామక్రియ సం: 03-017 కృష్ణ

పల్లవి:

భూమిలోనఁ గొత్తలాయఁ బుత్రోత్సవ మిదివో
నేమపు కృష్ణజయంతి నేఁడే యమ్మా

చ. 1:

కావిరి బ్రహ్మాండము కడుపులో నున్నవాని
దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని
యీవల వసుదేవుఁడు యెట్టు గనెనమ్మా

చ. 2:

పొడవుకుఁ బొడవైన పురుషోత్తముఁడు నేఁడు
అడరి తొట్టెల బాలుఁడాయనమ్మ
వుడగక యజ్ఞ భాగ మొగి నారగించేవాఁడు
కొడుకై తల్లి చన్ను గుడిచీనమ్మా

చ. 3:

పాలజలధి యల్లుండె(డై?) పాయకుండే యీతనికి
పాలవుట్ల పండుగ బాఁతే(తా?)యనటే
ఆలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి
పేలరియై కడు పెచ్చువెరిగీనమ్మా