పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-03 లలిత సం: 03-015 అధ్యాత్మ

పల్లవి:

అన్నిటా నా పాలిటికి హరి యాతఁడే కలఁడు
యెన్నికగాఁదుదిపద మెక్కితిమి మేలు

చ. 1:

కొందరు జీవులు నన్నుఁ గోపగించినా మేలు
చెంది కొందరట్టె సంతసించినా మేలు
నిందించి కొందరు నన్ను నేఁడే రోసినా మేలు
పొందుగ కొందరు నన్నుఁ బొగడినా మేలు

చ. 2:

కోరి నన్నుఁ బెద్దసేసి కొందరు మొక్కినా మేలు
వేరే హీనుఁడని భావించినా మేలు
కూరిమిఁ గొందరు నన్నుఁ గూడుకుండినా మేలు
మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు

చ. 2:

యిప్పటికిఁ గల పాటి యెంత పేదయినా మేలు
వుప్పతిల్లు సంపద నాకుండినా మేలు
యెప్పుడు శ్రీవేంకటేశు కే నిచ్చిన జన్మమిది
తప్పు లే దాతనితోడి తగులమే మేలు