పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0229-06 పాడి సం: 03-167 శరణాగతి

పల్లవి:

నేరనైతి నింతేకాక నే నిన్నాళ్లు
యే రీతి విచారించినా నిదివో నిశ్చయము

చ. 1:

నాకుఁగా వేరొకరు విన్నపము సేసేరా నీకు
వాకుచ్చి నేనే ఆడవలెఁ గాక
యీకడ నాకంటే హీనునిఁక నీవు గా(ం)చేవా
శ్రీకాంతుఁడ యిఁక నీ చిత్తమింతే కాక

చ. 2:

నీవల్ల బతుకలేక నేనొకరి వేఁడేనా
వావిరి నిన్నే కొసరవలెఁ గాక
నీ వితరణగుణము నీలోనే దాఁచుకొనేవా
సోవ నావంటివారికిఁ జూపవలెఁ గాక

చ. 3:

తల్లికి లేని ముద్దు దాదికిఁ గలదా మరి
చెల్లుబడి నీవే దయ సేయుటఁ గాక
తొల్లె శ్రీవేంకటేశ్వర తూరి నాలో నున్నాఁడవు
చల్లఁగా నీ చనవిచ్చి జరుపుటఁ గాక