పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0229-05 సామంతం సం: 03-166 కృష్ణ

పల్లవి:

చెప్పరాని మహిమల శ్రీదేవుఁడితఁడు
కప్పి కన్నుల పండుగగాఁ జూడరో

చ. 1:

అద్దుచుఁ గప్పురధూళి యట్టే మేన నలఁదఁగా
వొద్దిక దేవునిభావ మూహించితేను
మద్దులు విరిచినట్టి మంచి బాలకృష్ణునికి
మద్దులకాంతి మేన మలసినటుండె

చ. 2:

అమరఁ దట్టుపుణుఁగు అవధరించఁగాను
తమితోఁ బోలికెలెల్లఁ దచ్చిచూడఁగా
యమునానది నాఁగేట నండకుఁ దీసుకొనఁగా
యమునానది నలుపు అంటిన యట్టుండె

చ. 3:

అంగముల శ్రీవేంకటాధిపున కింతటాను
సింగారించి సొమ్ములెల్లఁ జెలరేఁగఁగా
బంగారపు టలమేలుమంగ నురాన నుంచఁగా
బంగారము మేననెల్లాఁ బరగినట్టుండె