పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0229-04 శ్రీరాగం సం: 03-165 వేంకటగానం

పల్లవి:

భావించరే చెలులాల పరమాత్ముని
చేవదేరి చిగురులో చేఁగయై యుండెను

చ. 1:

మలసి పన్నీట హరి మజ్జనమాడేవేళ
కలశాబ్ధిఁ దేలే మాణికమువలె నుండెను
అలరి కప్పుర కాపు అవధరించేటి వేళ
మొలచిన వెన్నెల మొలకయై యుండెను

చ. 2:

అంచలఁ దట్టుపుణుఁగు అవధరించేటి వేళ
యెంచ నంజనాద్రిపై యేనుగై వుండెను
మించిన హారములెల్ల మేన నించుకొన్న వేళ
మంచిమంచి నక్షత్ర మండలమై యుండెను

చ. 3:

వున్నతి నలమేల్మంగ నురమున నుంచు వేళ
పెన్నిధై పూచినట్టి సంపెంగవలె నుండెను
వన్నె శ్రీవేంకటేశుఁడు వరములిచ్చేటి వేళ
తిన్ననై యందరి భాగ్యదేవతయై యుండెను