పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0229-03 సాళంగనాట సం: 03-164 ఉత్సవ కీర్తనలు

పల్లవి:

భీకరపు చక్రమదె పిడుగులు రాలీనదె
పైకొని నిలువరాదు పారరో దిక్కులకు

చ. 1:

బండికండ్లరవమదే బంగారుమెఱుఁగులవే
కొండవంటి రథమదె గొడగులవే
మెండుగ దేవుఁడు వీధి మెరసి యేతెంచీ వాఁడే
బండుబండై యసురలు పారరో దిక్కులకు

చ. 2:

గరుడధ్వజమదే ఘంటారవములవే
సొరిది ముత్యాలకుచ్చులు నవే
బిరుదుశంఖముమ్రోఁత బెరయించీ దేవుఁడదే
పరగ దానవులెల్లఁ బారరో దిక్కులకు

చ. 3:

ముంగిట బలములవే మొరసీ భేరులవే
సంగతిఁ బ్రతాపమదే సాకారమదే
కుంగ కలమేలుమంగఁ గూడి శ్రీవేంకటేశుఁడు
భంగపెట్టీ దైతేయులు పారరో దిక్కులకు