పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0229-౦1 దేవగాంధారి సం: 03-162 కృష్ణ

పల్లవి:

ఒకరి కొకరు వొడ్డు దప్పులనే
పకపక నవ్వు పచరించేరు

చ. 1:

కొట్టీ నుట్లదె గోవిందుఁ డంతలో
తిట్టేరు గోపసతీమణులు
పట్టీ జన్నులట్టే పైపై గోవిందుఁడు
మెట్టెల పాదాల మెట్టే రింతులు

చ. 2:

వారవట్టీఁ బాలు వంచి గోవిందుఁడు
గోర గీరే రదే గొల్లెతలు
చీర లంటీనట్టె చెంది గోవిందుఁడు
మేరతోఁ గొప్పు వంచి మించే రింతులు

చ. 3:

కెలసి వెన్నారగించీ గోవిందుఁడు
తొలఁగఁ దోసేరు దొడ్డవారు
కలసెను శ్రీవేంకటాద్రి గోవిందుఁడు
అలమేరు మరి నంగనలు