పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0224-02 నాట సం: 03-133 రామ

పల్లవి:

బాపుబాపు రాఘవ నీ ప్రతాపమేమని చెప్ప
పైపై నీపేరు విని పారేరు రాకాసులు

చ. 1:

వాలినెత్తురు నీటను వాఁడి పదనిచ్చినమ్ము
కూలిచె నొక్కమాటునఁ గుంభకర్ణుని
యీలకొని మాయామృగ మెమ్ముల నొరసినమ్ము
రాలించె నుత్తరగోపురముపై గొడగులు

చ. 2:

తొడికి మింటి తాపలు తుంచి దూప దాఁకినమ్ము
జడధి మరుదేశాల జల మింకించె
యెడయక కౌశికుని యజ్ఞము గాచినమ్ము
అడరి రావణుని పూర్ణాహుతిగఁ జేసెను

చ. 3:

బెరసి యే పొద్దును నీ పిడికిటిలోనియమ్ము
సురల భయముఁ బాపి సూటికెక్కెను
ఇరవై శ్రీవేంకటాద్రి నిటు రామచంద్రుఁడవై
పరగఁగ నీయమ్ము పగయెల్ల నీఁగెను