పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0221-06 బౌళి సం: 03-119 శరణాగతి

పల్లవి:

కనకము కనకమే కడు నినుమినుమే
వెనక సరిదూఁగితే వెలువకురాదు

చ. 1:

హరిఁ గొలిచినవారి కమరు నన్నిసుఖాలు
గరిమతో వారల భాగ్యమే భాగ్యము
తెరమరఁగుల కర్మదేహులెల్ల వీరితోడ
పురుఁడు వెట్టుకోఁబోతే పోలికలు రావు

చ. 2:

భాగవతులైనవారు పట్టినదెల్లా నీడేరు
చేగదేర వారలు సేసినదే చేఁత
తీగెసంసారమత్తులు తెలియక వీరివలె
వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు (?)

చ. 3:

శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి
యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి
కావరపు మనుజులు గతిగనేమని వారి-
తోవల నడవఁబోతేఁ దూగదు తమకును