పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-05 లలిత సం: 03-011 అధ్యాత్మ

పల్లవి:

జ్ఞానినైనా నీకుఁ బో దజ్ఞానినైనా నీకు బోదు
నేను చేసిన నేరమి నీకే సెలవయ్యా

చ. 1:

గరిమ మా పుట్టుగు నీ గర్భవాసములోనే
అరయ మా మోక్షము నీ యరచేతిదే
వెరవు లెంచుకోఁబోతే వేరే మాకు గతి లేదు
నిరతి మా బదుకులు నీకు సెలవయ్యా

చ. 2:

నిండిన మా కోరికలు నీ పెర రేఁపులే
వుండఁ జోటు నీకు నా వుల్లములోనే
చండి పెట్టి మాకైతే స్వతంత్ర మించుకా లేదు
నిండిన మా చేఁతలెల్లా నీకే సెలవయ్యా

చ. 3:

యిదె మా సంసారములు యిట్టె నీ కల్పితములు
తుదమొదలును నీవే తోడునీడవు
యెదుట శ్రీవేంకటేశ యేలిన వాఁడవు నీవే
నిదుర మా దినములు నీకే సెలవయ్యా