పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-06 సాళంగనాట సం: 03-012 వైష్ణవ భక్తి

పల్లవి:

ఎక్కడి నరకములు యెక్కడి మృత్యువు మాకు
దక్కి నీ దివ్యనామామృతము చూరగొంటిమి

చ. 1:

తమితో శ్రీపతి నీ దాసులఁ జేరినప్పుడే
యమకింకర భయము లణఁగిపోయ
జమళి నీ యాయుధలాంఛనము మోచినప్పుడే
అమరఁ గాలదండము లవియెల్లఁ బొలిసె

చ. 2:

మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే
ఘనయామ్య మార్గము గట్టు వడియ
వొనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే
కనలు కాలసూత్రాది ఘాతలెల్లఁ బూడె

చ. 3:

యెడరై నీ మంత్రజప మెంచుకొన్న యపుడే
కడుఁ జిత్రగుప్తుని లెక్కలు గడచె
వడిగా శ్రీవేంకటేశ్వర మీ శరణనఁగా
అడరి వైకుంఠము మాయరచేత నిలిచె