పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-04 సాళంగం సం: 03-010 భక్తి

పల్లవి:

భక్తసులభుఁడును పరతంత్రుఁడు హరి
యుక్తిసాధ్య మిదె యొకరికీఁ గాఁడు

చ. 1:

నినుపగు లోకముల నిండిన విష్ణుఁడు
మనుజుఁడ నాలో మనికియయ్యె
మునుకొని వేదముల ముడిగిన మంత్రము
కొననాలికలలోఁ గుదురై నిలిచె

చ. 2:

యెలమి దేవతల నేలిన దేవుఁడు
నలుగడఁ నధముని నను నేలె
బలుపగు లక్ష్మీపతి యగు శ్రీహరి
యిల మా యింటను యిదివో నిలిచె

చ. 3:

పొడవుకుఁ బొడవగు పురుషోత్తముఁడిదె
బుడిబుడి మా చేతఁ బూజ గొనె
విడువ కిదివో శ్రీవేంకటేశ్వరుఁడు
బడి వాయఁడు మా పాలిట నిలిచి