పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-03 వరాళి సం: 03-009 వైరాగ్య చింత

పల్లవి:

ఐనదయ్యీఁ గానిదెల్లా నటు గాకుండితే మానీ
మానుపరాదివి హరి మాయామహిమలు

చ. 1:

పుట్టేటివెన్ని లేవు పోయేటివెన్ని లేవు
వెట్టి దేహాలు మోచిన వెడజీవులు
గట్టిగాఁ దెలుసుకొంటే కలలోనివంటి దింతే
పట్టి ఇందుకుఁగా నేల బడలేమో నేము

చ. 2:

కడచినవెన్ని లేవు కాచుకున్నవెన్ని లేవు
సుడిగొన్న తనలోని సుఖదుఃఖాలు
యెడపుల నివి రెండు యెండనీడవంటి వింతే
కడనుండి నేమేల కరఁగేమో నేము

చ. 3:

కోరినవియెన్ని లేవు కోరఁగలవెన్ని లేవు
తీరని సంపదలతో తెందేపలు
ధారుణి శ్రీవేంకటేశు దాసులమై యిన్నియును
చేరి కైకొంటిమి యేమి సేసేమో నేము