పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0221-04 ధన్నాసి సం: 03-117 శరణాగతి

పల్లవి:

శరణాగత వజ్రపంజరుఁ డీతఁడు చక్రధరుఁ డసురసంహారుఁడు
వెరవుతోడఁ దను శరణనువారి వెనుబల మీతఁడే రక్షకుఁడు

చ. 1:

హరినామోచ్చారణఁ దెగనికర్మ మవల వేరొకటున్నదా
అరసి యెందు నమ్మిక చాలక ప్రాయశ్చిత్తంబులు చెప్పుదురు
ధర నెరఁగనివారేమనినాఁ దామసులగొడవ యేమిటికి
హరిహరి యంటే దురితము లణఁగెను అతఁడే మాకిఁక రక్షకుఁడు

చ. 2:

శ్రీపతి దిక్కయి కావఁగ మరియునుఁ జేరని సంపద లిఁకనేవి
చాపలబుద్దుల (లు?) నది నమ్మక విచ్చనవిడి నోములు చెప్పుదురు
తీపులు పుట్టించి యెవ్వరేమనినఁ దెలిపి వాదడువ నేమిటికి
శ్రీపతిఁ గొలిచితి చేరె సంపదలు జిగి నితఁడే మా రక్షకుఁడు

చ. 3:

అంతరాత్మ శ్రీవేంకటేశ్వరుఁడు అన్యము భజించఁ జో టేది
యింతట నమ్మక దేవతాంతరము లేఁటేఁటివో మరి చెప్పుదురు
యెంతలేదు ప్రాకృతజనముల భ్రమ యెవ్వరిఁ గాదన నేమిటికి
యింతకు శ్రీవేంకటేశుదాసులము యీతఁడే మాకిఁక రక్షకుఁడు