పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0221-03 సామంతం సం: 03-116 అధ్యాత్మ

పల్లవి:

నీవు దేవుఁడవు నే నొక జీవుఁడ
యీ విధి నిద్దరి కెంతంతరువు

చ. 1;

పొడమిన జగములు పుట్టెడి జగములు
గుడిగొనె మీ రోమకూపముల
యెడయక నీరూప మేమని ధ్యానింతు
అడరి మీవాఁడ నేననుటే కాక

చ. 2:

మునుపటి బ్రహ్మలు ముందరి బ్రహ్మలు
మొనసి మీ నాభిని మొలచేరు
ఘనుఁడవు నిన్నేగతి నేఁ దెలిసెద
అనువుగ మిము శరణనుటే కాక

చ. 3;

సహజానందము సంసారానంద-
మిహముఁ బరముగా నిచ్చేవు
అహిపతి శ్రీవేంకటాధిప నీకృప
మహిలో సేవించి మనుటే కాక