పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0221-02 దేసాక్షి సం: 03-115 అధ్యాత్మ

పల్లవి:

దేవత లెందున్నవారో దిష్ట మెవ్వరిఁ గానము
యీవలఁ దామే కలితే నేమని రావలదా

చ. 1:

పరమేదో ఇహమేదో బదికే జీవులకెల్ల
నరకపు దేహాలలో నానుచున్నారు
అరసి పుట్టించినట్టి అజుఁ డెందు దాఁగినాఁడో
సరిగాన మెవ్వరిఁ గొసరేమంటేను

చ. 2:

యేమి గలి గేమి సెలవెన్నటికో తమమేలు
యీ మేరఁ బ్రాణులు మాయ నీఁదుచున్నారు
భూమికి దిక్కైనవారు పొడచూపి కావవద్దా
దీముగా నిలువలేరు తెలిసేమంటేను

చ. 3:

తుదయేడ మొదలేడ తొంగి చూచేవారెవ్వరు
అదె సంసారానఁ బ్రాణులాడుచున్నారు
ఇదె శ్రీవేంకటేశ్వరుఁ డింతలో విచ్చేసి కాచె
యెదుట రక్షకుఁడైతే నిట్టుండవలదా