ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 07-2 శంకరాభరణం సం: 10-037
పల్లవి:
అన్నిటా నీదిద్దుబడె అది విచారించవయ్య
యెన్నుకొని నన్ను నేర మెంచకుమీ అయ్యా
చ. 1:
నీవొళ్లి నేరము లెంచి నెరవాది నైతిఁ గాక
కావించి నేఁ దొల్లేమి కతకారినా
కోవరపు నీగుణాలు కోపము రేఁచెఁ గాక
కావలసి నేఁ దొల్లి గయ్యాళినా
చ. 2:
సారె నీబాసతప్పులె చలపాదిఁ జేసెఁ గాక
నేరిచి నాయంత నేనె నిష్టూరినా
పేరడి నీయెడమాట పెచ్చు వెరిగించెఁ గాక
రారాఁపుల నేఁ దొల్లి రచ్చ కెక్కేనా
చ. 3:
తక్కరి నీవిద్యలె దంటఁ జేసెఁ గాక నన్ను
గక్కనఁ దొల్లి కయ్యాన కాలు దవ్వేనా
కక్కసించి శ్రీవెంకటనాథ కూడితివి
లక్కవలెఁ గరగక లాఁతిదాననా.