ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 07-1 రామక్రియ సం: 10-036
పల్లవి:
తెఱవ లందరుఁ గూడి తిద్దిరిగా నిన్నును
మఱపు వెఱపు లేక మాకొరకుఁగానె
చ. 1:
కన్నులనె వలపించే కాంతలు గలుగఁగా
పిన్ననాఁడె గుణములఁ బెద్ద పైతివి
మున్నిటివారి యధరముల తేనె సోఁకఁగా
తిన్నని నీమాటలకు తీపు లెక్కెను
చ. 2:
యిచ్చకాన సింగారించే యింతులు గలుగఁగా
కచ్చుపెట్టి యింత వన్నెకాఁడ వైతివి
మచ్చికతోడ నందుక మరిగి రాఁగా గఁదా
నిచ్చలపుఁ బిల్లఁగోవి నెరజాణ వైతివి
చ. 3:
తరుణులు నీతో జాణతనము లాఁడగఁగా
గరువతనాన మాటకారి వైతివి
కరఁగి వారెల్లా శ్రీవెంకటనాథ కూడఁగాఁగా
పరువపు నారతి బెంబడి నోడ వైతివి.