Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 05-2 దేసాళం సం: 10-025

పల్లవి:

నేఁడు నీచేఁత లెల్లా నీ వెరఁగవా
నీడనుండె యలసేవు నీ వెరఁగవా

చ. 1:

వేమారు నాచేత వెళ్ల నాడించ నేఁటికి
నీమనసులోని కల్ల నీ వెరఁగవా
దీమసానఁ బెక్కిండ్లు దిరిగి వచ్చేవాఁడవు
నేమపు నీగుణములు నీ వెరఁగవా

చ. 2:

గుట్టున నుండక నాకుఁ గోపము రేఁచ నేటికి
నెట్టన నీనడవడి నీ వెరఁగవా
చుట్టాలసురభి వని సోఁకనాడినంతలోనె
నిట్టచూపులు చూచేవు నీ వెరఁగవా

చ. 3:

పన్ని నీనిజము లీడఁ బచరించ నేఁటికి
నిన్నటి నీసుద్దు లెల్లా నీ వెరఁగవా
నన్ను నిట్టె శ్రీవెంకటనాథుఁడ నీవె కూడి
నిన్ను నన్ను మెచ్చేవు నీ వెరఁగవా.