Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 01-3 సామంతం సం: 10-3

పల్లవి:

అవునె లెస్సతగవులాయనే నేఁడు
తివిరి నీకింత నాతో దీకొనఁగవలెనా

చ. 1:

మాఁటఁల దేలించనేర్చుమగువా నీకు నిప్పుడు
యేఁటికె నా విభునితో నేకాంతము
వాఁటమై నాపతిపొందు వద్దన్నా మానవు
గాఁటాన నీకింతయేలె గామిడితనాలు

చ. 2:

కూరిమివుట్టించనేర్చుకోమలి యేఁటికే నీకు
చేరి నారమణునితోఁ జేసన్నలు
సారెకు నామగనితో సరసాలు మానవు
కారణములేని దేలె గయ్యాళితనాలు

చ. 3:

కలసి మెప్పిచనేర్చుకామిని యేఁటికె నీకు
నెలవై నాకాంతునితో నెయ్యములు
యిల శ్రీవెంకటనాథుఁ డిద్దరి మన్నించికూడె
మలసి మనలో నిఁక మచ్చరా లేమిటికె