ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 01-2 మధ్యమావతి సం: 10-2
పల్లవి:
విన్నవించవే వోరమణి విభునికి వింత లింకనేలె
వున్నతిఁ దన్ను నే నేమైన నంటినా వోరుచుకొమ్మనవే
చ. 1:
చెలులలో నన్నె చేపట్టినవాఁ డలుగనేఁ టికినే
వలచి తానాకు నిచ్చినబాసలు వాకిటనె పోయనా
తలఁచి తలఁచి తాపాన నే నిట్టె తలఁకుచు నుండఁగా
కలయఁ దా రాక యెడమాఁటలనె కాఁకరేఁచ నేలె
చ. 2:
యెప్పుడు నావద్దఁ బాయనివాడు నేఁ డేమిటికిఁ బోయనే
తప్పెనో నామీఁది మోహము తనకు తామసించ నేలె
ముప్పిరిగొన్నట్టి జవ్వనము నే మోవలేకవుండఁగా
యిప్పుడెవిచ్చేసి నన్నుఁ గలయక యేమిటికున్నాఁడె
చ. 3:
యెక్కుడుమాఁట దన్నాడని నాతోడనేఁటికిఁ గోపించెనే
వొక్కటై నే నెంతమీరి నవ్వినా నూరకుండేవాఁడు
చక్కని శ్రీవెంకటనాథుఁడు నన్ను సరవితోఁ గూడెనే
మక్కువ న న్నింక దిగవిడువక మన్నించు మనవె