ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 01-1 వరాళి సం: 10-1
పల్లవి:
ఎట్టకేల కిదేలరా యెన్నఁడులే నలవాటు
చిట్టకాల కిన్నా ళ్లిట్టె సేయవత్తువా
చ. 1:
దవ్వుల నాటఁ జూచేవు దగ్గరి మాఁటలాడేవు
యెవ్వతైనా మతకాన కీడ కంపెనో
యివ్వల నిన్నాళ్లు మనమిద్దరము నొక్కవూరె
నవ్వులు మాతో నిట్టె నవ్వవత్తునా
చ. 2:
వొరసేవు రమ్మనేవు వోరి ముచ్చట లాడేవు
గరిమ రేతిరి కలగంటివా నీవు
యిరవుగ నేను నీవూ నిద్దరము నొక్కవూరె
నెరతనా లిట్లానె నెరపుదునా
చ. 3:
యిక్కువ నాతోఁజెప్పేవు యిప్పుడిట్టె రమ్మనేవు
యెక్కువ నామనసు నీవెఱుఁగుదువా
చక్క శ్రీవెంకటనాథ సరవి నన్నుఁ గూడితి
మక్కువ వెనక కిట్టె మన్నింతువా