ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0009-06 మాళవి సం: 10-054
పల్లవి:
నూరవద్దు తాగవద్దు నోరు చేఁదుగావద్దు
చేరువ నొకచోట సంజీవి వున్న దిదివో
చ. 1:
పొలమెల్లాఁ దిరిగాడి పొడిఁబడనెవద్దు
తలఁకక గడ్డపారఁ దవ్వవద్దు
వలవని వాఁగుల వంకల వెదకవద్దు
చెలఁగి వొకచోటసంజీవి వున్న దిదివో
చ. 2:
మొక్కలానఁ జెరువులో మునిఁగి చూడవద్దు
నిక్కిన పుట్టలమీఁద నెమకవద్దు
వెక్కసానఁ జేతిపైఁడి వెలవెట్టి కొనవద్దు
చిక్కులెల్లా బాపెటిసంజీవి వున్న దిదివో
చ. 3:
దీవులను నోడలెక్కి తిరుగాడనేవద్దు
సోవల బిలములోనఁ జొరవద్దు
కావించి గ్రహణాదికాలము వెదకవద్దు
శ్రీవెంకటనాథుడైసంజీవి వున్న దిదివో