Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0009-04 దేసాళం సం: 10-052

పల్లవి:

ఎట్టిహితోపదేశకుఁ డెటువంటిదయాళువు
అట్టె తాళ్లపాకన్నమాచార్యులు

చ. 1:

పచ్చితామసుల మమ్ముఁ బరమసాత్వికులఁగా
యిచ్చటనె సేసినాఁడు యెంతచిత్తము
యిచ్చగించి మాకులాన నెన్నఁడులేనివైష్ణవ
మచ్చముగాఁ గృపసేసె నన్నమాచార్యుఁడు

చ. 2:

ముదిరిన పాపకర్మములు సేసినట్టి మమ్ము
యెదుటఁ బుణ్యులఁ జేసె నెంతసోద్యము
కదిసి యేజన్మానఁ గాననిసంకీర్తన
మదన నుపదేశించె నన్నమాచార్యుడు

చ. 3:

గడుసుఁదనపు మమ్ముఁ గడు వివేకులఁ జేసి
యిడుమలెల్లాఁ బాప నేమరుదు
నడుమనె యెన్నఁడుఁ గానని శ్రీవెంకటనాథు
నడియాలముగ నిచ్చె నన్నమాచార్యుఁడు