Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0008-06 శుద్ధవసంతం సం: 10-048

పల్లవి:

మేలేమి కీడేమి మించిన నీరూపమె
వాలాయించి తెలిసినవానికి

చ. 1:

యినుమేమి పసిఁడేమి యెంచిచూచితె
మనసు దెలిసిన నిర్మలునికి
ఘనమేమి కిరుదేమి కలవెల్లా నీ
తనువుగఁ దెలిసిన తత్వజ్ఞానికి

చ. 2:

పగయేమి చెలిమేమి పలుమారు నిన్ను
పొగడుచునుండెటి పుణ్యునికి
వగుపేమి వేడుకేమి వరుసతో నిన్ను
వెగటులేక కొలిచే వివేకికి

చ. 3:

చేరువేమి దవ్వేమి శ్రీవెంకటనాథ నిన్ను
కూరిమిఁ గొలిచిన సద్గుణునికి
బారమేమి పాటేమి పరమాత్మా నిన్ను
సారమతిఁ దెలిసిన సర్వజ్ఞునికిని