Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0008-05 లలిత సం: 10-047

పల్లవి:

జగదీశ్వరుని లీలాచక్రములోపలనుండి
మగుడ దాసుఁడుగాక మాయ దాఁట వసమా

చ. 1:

తనువు నాదెయనఁగ తనకు స్వతంత్రమేది
తనువులో తాను హరి తను వెకాన
మనసులో యీసుద్ది మరినమ్మితేఁ జాలు
వెనకముందరలకు విచారమేలేదు

చ. 2:

సొమ్ములు నావియనఁగ సోధించఁ దానెవ్వఁడు
సోమ్ములునుఁ దాను హరిసొమ్ము లెకాన
సమ్మతి నీతలఁపె సహజమై కలిగితే
నెమ్మదిఁ దా నిన్నిటా నిశ్చింతుఁడౌను

చ. 3:

బంటులు నావారనఁగఁ బరికించ నెవ్వఁడు
బంటులును దాను హరిబంట్లెకాన
నంటున శ్రీవెంకటనాథునిఁ గొలిచితేను
కంటకములెల్లాఁ బాసి ఘనుఁడె తానౌను