Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0008-02 లలిత సం: 10-044

పల్లవి:

అందరు వికార మందుదురె
నిందలేని నీవు నీదాసులుదక్క

చ. 1:

సతుల సుతులఁ జూచి జగములోవారెల్లా
మతిలోన భ్రమయక మానరు
రతికెక్కఁగా హేయరాగరహితుఁడవై
సతతము గలిగినస్వామివి నీవు దక్క

చ. 2:

ధనధాన్యములుచూచి తగినజీవులు వాని
వెనువెంటఁ దిరుగక విడువరు
పనివూని యాశాపాశ దూరుఁడవై
ఘనతగలుగు శ్రీకాంతుఁడ నీవుదక్క

చ. 3:

యిల్లుముంగిలిచూచి యీదేహులు వాని
నొల్ల మనుచురోసి వుడుగరు
వెల్లవిరిగ శ్రీవెంకటనాథుఁడవై
తెల్లమైనయట్టి దేవుఁడవుదక్క