ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0008-01 దేసాళం సం: 10-043
పల్లవి:
వట్టి విచారములేల వగపులేల
నెట్టన శ్రీహరిఁ జేర నేరవలెఁగాక
చ. 1:
కాల మేమి సేసీని కర్మ మేమి సేసీని
యేలిన శ్రీరమణుఁడె యెదనుండఁగా
ఆలించిన ధ్రువునిని అజామిళునిని
కాల మేమిసేసె నయ్య కర్మ మేమిసేసెను
చ. 2:
పాప మేమి సేసీని పగ యేమి వేసీని
కాపాడె దేవుఁడె దగ్గరనుండఁగా
యేపున ఘంటాకర్ణుని యెలమిఁ బ్రహ్లదుని
పాప మేమి సేసెనయ్య పగయేమి సేసెను
చ. 3:
కుల మేమి సేసీని గుణ మేమి సేసీని
నలువైన శ్రీవెంకటనాథుఁ డుండఁగా
ఆలరి వాల్మీకికి అలనాఁ డహల్యకు
కుల మేమి సేసెనయ్య గుణ మేమిసేసెను