ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0007-04 ఆహిరినాట సం: 10-040
పల్లవి:
ఇందురు నేల దూరేరు హితవే నీవు సేయఁగా
ముందు ముందె తమ్ముఁ గర్మములు సేయు మంటివా
చ. 1:
తెలిసి నిన్నుఁ గొలువ దేహ మిచ్చితివి గాక
బలిమినె మాయలలోఁ బడు మంటివా
మలసి నిన్నుఁ దలఁచ మన సిచ్చితివి గాక
కొలగట్టి విషయాలఁ గోరు మంటివా
చ. 2:
నగుతా నిన్నుఁ బొగడ నాలు కిచ్చితివి గాక
అగడుగా నూరమాఁట లాడు మంటివా
సొగసి నిన్నుఁ జూడఁగాఁ జూప లిచ్చితివి గాక
వగవగలతో నూరివారిఁ జూడు మంటివా
చ. 3:
శ్రీవెంకటనాథ నిన్నుఁ జేరు మ నంటివి గాక
జీవులను మనుజులాఁ జేరు మంటివా
భావించి నీదాసులనె భజించు మంటివి గాక
దావతి లంపటాలలోఁ దడఁబడు మంటివా