Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0007-03 లలిత సం: 10-039

పల్లవి:

తాళపాకన్నమాచార్య దైవమవు నీవు మాకు
వేళమె శ్రీహరిఁ గనేవెర వానతిచ్చితివి

చ. 1:

గురుఁడవు నీవెసుమ్మీ కుమతి నై ననాకు
సరవి బ్రహ్మోపదేశము సేసితి
పరమబంధుఁడ వైనా పరికింప నీవెసుమ్మీ
వరుస నేఁ జెడకుండ వహించుకొంటివి

చ. 2:

తల్లివైన నీవెసుమ్మీ తగిన విషయాలలో
పల్లదానఁ బడకుండా బ్రదికించితి
అల్లుకొని తోడునీడవైనా నీవెసుమ్మీ
చిల్లరమాయలలోనఁ జెడకుండాఁ జేసితి

చ. 3:

దాతవు నీవెసుమ్మీ తగు శ్రీవెంకటనాథు
నాతలఁపులో నిలిపి నమ్మఁ జేసితి
యేతలఁ జూచినా నాకు నేడుగడయు నీవె
ఆతల నీతల నన్ను నాడుకొని కాచితి