Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0007-02 సామంతం సం: 10-038

పల్లవి:

దవ్వులతెరువు మరేఁటికి తడఁబాటులు మరి యేటిఁకి
యెవ్వరు దలఁచిన నిదియె యీపరముల నొసఁగున్‌

చ. 1:

మన సనియెడు పెనువింటను మాయాలక్ష్యముపైని
పనివడి జ్ఞాన బనియెడి బాణం బేసినను
వెనకటి దుష్కర్మంబులు వేళ్లతోడఁ బెకలిన
తనయకతనె సకలంబును తప్పక కాన నగు

చ. 2:

మలయుచు మంత్రార్థం బను మందరగిరిచేతను
చలమున సంసారం బను జలనిధి దచ్చినను
అలవడ హరిభక్తి యనెడి యమృతము వొడమినను
పొలసెటి చావునుఁ బుట్టుగు పొడమక బదుక నగున్‌

చ. 3:

జీవుఁ డనియెడిపాదున చిరకాలంబును మొలచిన
శ్రీవెంకటనాథుండును సిద్ధౌషధతరువు
భావింపఁగఁ దనకృపయను పండూ వండినను
కావలసిన యర్థము దనకైవస మగుఁ గానా