ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0006-03 సాళంగనాట సం: 10-033
పల్లవి:
ఈలగద్ద మూకఁలోన యించుకకోడిపిల్లకు
మూలమూలలఁ దలారికములు చెల్లునా
చ. 1:
మంచుకుఁ బెట్టినయట్టి మైనపుఁగుళ్లాయలు
అంచెల లవుడి పెట్టు లానఁ బోయీనా
పంచేంద్రియము లెల్ల బలవంతములై వుండఁగా
యించుక నావైరాగ్య మేడ కెక్కీని
చ. 2:
గుగ్గిళ్లు వెలవెట్టి కొనిన గుఱము లెల్ల
దగ్గరి యగడుతలు దాఁటఁబోయీనా
నిగ్గుల బాదకుఁ గాక నేరిచిన సుద్దులెల్లా
వెగ్గళమై యింతటను వెలవెట్టీనా
చ. 3:
పోరుకుఁ జాలక పోయి పొడిచే పోటు లెల్లా
నారటిలుఁ గాక అవి నాటఁ బోయినా
గారవాన శ్రీవెంకటనాథుఁడు గావఁగా
భారములు భయములుఁ బాసె నింతె కాకా