ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0006-02 గౌళ సం: 10-032
పల్లవి:
చిన్నవాఁడు నాలుగుచేతులతో నున్నాఁడు
కన్నప్పుడె శంఖముఁ జక్రముఁ జేత నున్నది
చ. 1:
నడురేయి రోహిణినక్షత్రమునఁ బుట్టె
వడిఁ గృష్ణుఁడిదివో దేవతలందు
పడిన మీబాధ లెల్ల ప్రజలాల యిప్పుడిట్టె
విడుగరాయ మీరు వెరవకుఁ డిఁకను
చ. 2:
పుట్టుతానె బాలుఁడు అబ్బురమైన మాఁటలెల్ల
అట్టె వసుదేవుని కాన తిచ్చెను
వట్టిజా లింకేల దేవతలాల మునులాల
వెట్టివేములు మానెను వెరవకుఁ డిఁకను
చ. 3:
శ్రీవెంకటనాథుఁడె యాసిసువు దా నైనాఁడు
యీవల వరము లెల్లా నిచ్చుచును
కావఁగ దిక్కైనాఁ డిక్కడనె వోదాసులాల
వేవేగ వేడుకతోడ వెరవకుఁ డిఁకను