Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ .రేకు: 0001-02 బౌళి సం: 10-002

పల్లవి:

గోవింద గోవింద యని కొలువరె
గోవిందా యని కొలువరె

చ. 1:

హరి యచ్యుతా యని యాడరె
పురుషొత్తమా యని పొగడరె
పరమ పురుషా యని పలుకరె
సిరివర యనుచునుఁ జెలఁగరే జనులు

చ. 2:

పాండవ వరద యని పాడరె
అండజ వాహనుఁ గొనియాడరె
కొండలరాయనినే కోరరె
దండితో మాధవునినే తలఁచరె జనులు

చ. 3:

దేవుఁడు శ్రీవిభుఁడని తెలియరె
సోవల ననంతునిఁ జూడరె
శ్రీవేంకటనాధునిఁ చేరరె
పావనమై యెప్పుడును బ్రదుకరే జనులు