ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0001-01 వరాళి సం: 10-001
పల్లవి:
రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా
సౌమిత్రి భరతశతుఘ్నులతోడ జయమందు దశరథరాఘవా
చ. 1:
శిరసు కూఁకటుల రాఘవా చిన్నారిపొన్నారి రాఘవా
గరిమ నావయసున తాటకిఁ జంపిన కౌసల్యనందన రాఘవా
అరిది యజ్ఞముగాచి రాఘవా యట్టె హరునివిల్లువిరిచినరాఘవా
సిరులతో జనకునియింట జానకిఁ జెలఁగి పెండ్లాడినరాఘవా
చ. 2:
మలయు నయోధ్యారాఘవా మాయామృగాంతక రాఘవా
చెలఁగి చుప్పనాతిగర్వ మడఁచి దైత్య సేనల జంపిన రాఘవా
సొలసి వాలిఁజంపి రాఘవా దండి సుగ్రీవు నేలిన రాఘవా
జలధి బంధించిన రాఘవా లంకసంహరించిన రాఘవా
చ. 3:
దేవతలుచూడ రాఘవా దేవేంద్రురథమెక్కి రాఘవా
రావణాదులనుఁ జంపి విభీషణు రాజ్యమేలించిన రాఘవా
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయపట్టమేలి రాఘవా
శ్రీవెంకటగిరిమీద నభయములు చెలఁగి మాకిచ్చిన రాఘవా