Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0005-02 గౌళ సం: 10-026

పల్లవి:

నిచ్చలూఁ జెడనియట్టి నీకె తెలుసుఁ గాక
యిచ్చల మావంటివా రేమెరుఁగుదు రయ్యా

చ. 1:

బాలుఁడు వృద్ధనియెటి పరిభాష లన్నియును
మూలమూలలను దేహమునకె కాక
యీలో నెంచి చూచితే నెన్నటివాఁడు
కోలుముందై పెరిగీనో కొంచె మయ్యీనో

చ. 2:

మంచిది చెడ్డ దనెటిమాఁట లెల్లా భువిలోన
యెంచి చూడ మనుజుల కింతె కాక
నించి సర్వపూర్ణుఁడవై నీవు లేనిచోటేది
తుంచరాదు పెంచరాదు తొల్లె కలవు

చ. 3:

వాఁడు వీఁడనియెటివచనాలు జగములో
పోఁడిమి జీవులయందె పొసఁ గెఁ గాక
వేఁడినా కొసరినాను విశ్వవ్యాపకుఁడవై
నాఁడు నేఁడు శ్రీవెంకటనాథుఁడవె కలవూ