Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0004-05 సాళంగనాట సం: 10-023

పల్లవి:

అప్పనివరప్రసాది అన్నమయ్యా
అప్పసము మాకె కలఁ డన్నమయ్యా

చ. 1:

అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన
యంతరంగాన నిలిపీ నన్నమయ్యా
సంతసానఁ జెలువొందె సనకసనందనాదు
లంతటివాఁడు తాళ్లపాకన్నమయ్యా

చ. 2:

బిరుదు టెక్కెములుగా బెక్కు సంకీర్తనములు
హరిమీఁద విన్నవించె నన్నమయ్యా
విరివిగలిగినట్టి వేదముల యర్థ మెల్లా
అరసి తెలిపినాఁడు అన్నమయ్యా

చ. 3:

అందమైన రామానుజాచార్యమతమున
అందుకొని నిలిచినాఁ డన్నమయ్యా
విందువలె మాకును శ్రీవెంకటనాథుని నిచ్చె
అందరిలో దాళ్లపాక అన్నమయ్యా