Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0004-04 రామక్రియ సం: 10-022

పల్లవి:

భవరోగవైద్యుఁడైన బలువెజ్టు
సవరని ఫైఁడిపక్షిసకినగాఁడు

చ. 1:

తల్లి వద్ద నోరిలోన తగ లోకములు చూపి
వెల్లవిరి నింద్రజాలవిద్యవాఁడు
చెల్లుబడి నొక్కకొండ చేతఁ బట్టి యెత్తినాఁడు
బల్లిదుఁడు వాడివో బారివిద్యవాఁడు

చ. 2:

మునుపె సకలభూతములను నేలికయై
మనసెల్లా నెరిగిన మంత్రవాది
చనవున జలథిలో సంప దింద్రునికిఁ జూపె
అనువరి వాఁడివో అంజనగాఁడు

చ. 3:

పట్టరాని కాళింగుపడిగెలమీఁదు మెట్టి
పట్టినాఁడు వాఁడువో పాములవాఁడు
అట్టె శ్రీవెంకటనాథుఁ డమరుల నెల్లనుఁ జే
పట్టి దైత్యులఁ జంపించే పాళగాఁడు