ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0004-01 లలిత సం: 10-019
పల్లవి:
కుడువనికుడుపులు కొనసాగె మమతలు
కడువేగ శ్రీహరిఁ గానఁగవలదా
చ. 1:
నమలక చవులయ్య నాతుల సుద్దులు
అమర చింతకాయలవంటివి
భ్రమసి కొరుకఁబోతె పండ్లు వులుసును
తెమలక శ్రీహరిఁ దెలియఁగ వలదా
చ. 2:
విచ్చక మెరుఁగులు విడివడ్డ వలపులు
పచ్చి మేడిపంటి భావమువి
మెచ్చి లోను చూడ మెదలుపురువులె
గచ్చుల యివి మాని కనవద్దా హరిని
చ. 3:
బడలని పంట వో పైపైనే హరిభక్తి
కడలేని కల్పవృక్షమువంటిది
కడఁగి కొలువ శ్రీవెంకటనాథుఁడె గురి
బడినె యీతనిఁ గని బ్రదుకఁగ వలదా