Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0003-05 బౌళి సం: 10-017

పల్లవి:

తనకోరిక లేఁటికి నాతఁడె యిన్నియుఁ గల్పించఁగ
అనువుగ నిందుకు యిద్దరియత్నంబులు వలెనా

చ. 1:

అద్దముచూచెటియాతఁ డలరుచు నవ్విన నవ్వును
అద్దములోపలినీడయు నారీతినె కాదా
గద్దరియగు శ్రీవిభుసంకల్పంబుననె జగముల
సుద్దులు దుఃఖము సుఖమును సూటిఁబఁడె గానా

చ. 2:

నాఁటక మాడించునతఁడు నయమునఁ గదలింపంగా
నాఁటక మందలిబొమ్మలు నానాగతిఁ జెలఁగున్‌
ఆటలఁ జేతన్యాత్మకుఁడగు దేవుని చేష్టలనె
పాటిగఁ బాపముఁ బుణ్యము బహుళం బగుఁగానా

చ. 3:

అరదము నడపెటిసారథి యటునిటు వాగెటు వట్టిన
అరదముగుఱ్ఱములు మెలఁగు నాయాముఖములను
నరులను శ్రీవెంకటగిరినాథుఁడె తగ బ్రేరింపఁగ
గరవము లేమియుఁ గలిమియుఁ గలిగుండుఁ గానా