ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 17-5 బౌళి-వర్మతాళం సం: 10-100
పల్లవి:
ఇంక నేలా నాతోడ యింత సేయ
అంకెకాఁడ వౌర శేషాద్రినాథా
చ. 1:
చల్ల లమ్మేవారి కేల చందనము
చెల్లు నీవె పూసుకోరా చిన్నవాఁడ
కల్లరివై నాతో నేల గయ్యాళించ
మల్లాడ నీ వదినెనో మరఁదలనో
చ. 2:
జట్టిగా గొల్లెతల కేల చంద్రగావి
గట్టి గాఁగా నీవె దట్టి గట్టుకోరా
గట్టువాతనమునఁ గదిసి నన్ను
పట్టేవు నీ చుట్టెమనో పక్కమనో
చ. 3:
మందలోనివారి కేల మల్లెలు
ముందు నీవె కొప్పులోన ముడుచుకోరా
అంది శ్రీవెంకటనాథ అవురా నన్ను
అందముగాఁ గూడితివి ఆల నటరా