Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 17-4 సామంతం సం: 10-099

పల్లవి:

ఇచ్చకమె సేసే వేరా నీవు
యెచ్చోటి చనవరి వేరా నీవు

చ. 1:

మన్నించి నన్ను నిట్టె మరఁదల రమ్మనేవు
యెన్నటి మేనవాఁడ వేరా నీవు
వెన్నుఁడ నన్ను నిట్టె విడెము దెమ్మనేవు
యెన్ని దాఁచఁ బెట్టితివి యేరా నీవు

చ. 2:

మెప్పించి నాతోడ మేలము లాడేవు
యెప్పటి నేస్తకాఁడ వేరా నీవు
దుప్పటికొంగు నాపై దొడిఁబడఁ గుప్పేవు
యిప్పు డెన్నటిపొందు యేరా నీవు

చ. 3:

కానిరా నను నిట్టె కాఁగిలించుకొనేవు
యేనాటి చుట్టెమవు యేరా నీవు
కానిపించి నన్ను శ్రీవెంకటనాథ కూడితివి
యేనెలవున నేలితి వేరా నీవూ.