ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 16-4 శుద్ధదేశి సం: 10-093
పల్లవి:
కన్నెపడుచుతో నేమి గయ్యోళించేవు
అన్నిటా మచ్చికైతె నిన్నాపె మించ నోపదా
చ. 1:
దివ్వెకు మానెవోనె పతిమఁ జూచి ముద్దరాలు
యెవ్వతో వున్న దని యిదె కొంకీని
నవ్వు లేమి నవ్వేవు నాలికాఁడ చెయివట్టి
జవ్వనిఁ దియ్యరాదా చలివాయను
చ. 2:
పొదిగి పాదాలు గుద్దే బొమ్మఁ జూచి గోలయై
అదెవ్వతో వున్న దని అండు కాచీని
యిదేమి వేడుక చూచే వెమ్మె కాఁడ కొంగువట్టి
కదియఁ దియ్యఁగ రాదా కళ రేఁగను
చ. 3:
చేయంటి సురటి వీచే చేఁతాళపు రూప్ప చూచి
పాయని దెవ్వతో యని బాల లోఁగీని
కాయజకేలిని శ్రీవెంకటనాథ కూడితివి
ఆయెడ న న్నింద నిల్పి యతి మోదమునను.