Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 16-2 వరాళి సం: 10-091

పల్లవి:

ఎటువంటి దొర వైతి వేమయ్య నీవు
అటమటముల నీకు నాచార మేది

చ. 1:

వెనక నా యడపమువెలఁది మో వానితివి
అనువుగ నేఁ గంటి నద్దములోన
తనియక నాకు నిట్టె తమ్ముల మిడ వచ్చేవు
యెనసి వూడిగపుదానెంగిలి కోపుదునా

చ. 2:

ముచ్చట నా కాళాంజిముదితఁ గాఁగిలించితి
వచ్చుగా నే రత్నపుగోడావలఁ గంటి
యిచ్చకాన నామీఁద నిట్టె చెయి వేసేవు
చెచ్చెర సేవకురాలిచెమట కోపుదునా

చ. 3:

వొద్దనె నా కుంచదాని నొగిఁ దోఁటలోఁ గూడఁగా
నిద్దపుఁ గేళారూళి నీటిలోఁ గంటి
గద్దరివై నన్ను శ్రీవెంకటనాథ కూడితివి
అద్దో పరిచారకురాలంటుకు నోపుదునా.