ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 16-1 శ్రీరాగం సం: 10-090
పల్లవి:
వల పేమి గంపఁ గమ్మవచ్చునా యెందైన
చెలులాల మాయిద్దరి చిత్తములే యెరుఁగు
చ. 1:
యెనయని కోపమున యేమైనా నంటిఁ గాక
మనసులో మమతలు మానఁ గలనా
ఘనమైన పొలయలుకలఁ గొసరితిఁ గాక
వినరమ్మె రమణుని వితనాడఁ గలనా
చ. 2:
ఆలసించి రాఁగానె అన్నియుఁ దిటితిఁ గాక
మేలుదాన వానిఁ బాసి మించఁ గలనా
ఆలరి యై తిరుగఁగ నమ్మరో దూరితిఁ గాక
బాలకి నైన వానిఁ బాసి వుండఁ గలనా
చ. 3:
దగ్గరని కాఁతాళాన తగుఁ దగ దంటిఁ గాక
యెగ్గువట్టి వానితప్పులెంచఁ గలనా
కగ్గు లేక శ్రీవెంకటనాథుఁడె నన్ను
అగ్గల మై కూడె వానియండ వాయఁ గలనా.