Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 14-2 ముఖారి-ఏకతాళి సం: 10-079

పల్లవి:

తేటతెల్ల మిమాఁటలఁ దెలియ నాడఁ గదరా
మాటి మాటి కింత యేల మరఁగు లాడేవు

చ. 1:

కన్నుల నవ్వుల నేల గయ్యాళించేవు నేము
నిన్ను వంటి వొరపులే నేరుతుమా
సన్నలా చాయలా నేల సాధించేవు వో
వెన్నుఁడా నే మింతేసి వెర వెఱుఁగుదుమా

చ. 2:

తక్కరిమాఁటల జాణతన మాడేవు నేము
చక్కఁగా నీవలె నంత చదివితిమా
మిక్కిలి వాఁడిగోళ్లు మీఁదఁ జిమ్మేవు నేము
కక్కసపు జేఁతలకు కరఁగ నేరుతుమా

చ. 3:

నిబ్బరపు గాఁగిటను నించే వేమిరా నేము
అబ్బురంపు నిన్ను నౌఁ గా దనఁ గలమా
గబ్బివై కూడితి శ్రీవెంకటనాథుఁడా నేము
వొబ్బిడి నింత సేసితే వొద్దనఁగఁ గలమా