ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 13-5 కేదారగౌళ సం: 10-076
పల్లవి:
నేనె యనంగ నేల నీమనసూ నెరఁగదా
ఆనవెట్టి చెప్పేఁ జుమ్మీ ఆసగింతు నీకు
చ. 1:
చిగిరించె కోపమున జేఁదై నవలపు
తెగనట్టి తమకానఁ దీపాయరా
వొగరుఁగాకలచేత నుడికేటి దేహము
సగము మొగమోటానఁ జల్ల నాయరా
చ. 2:
చిమ్మిరేఁగె జగడాల జీఁక టైనమోహము
దిమ్మరియెడమాఁటలఁ దేటవారెరా
సమ్మతిగా నీ వొట్ల సైంచనిపొందుల
యెమ్మెల కోరికలచే నితవాయరా
చ. 3:
చెదరని రేసులఁ జిన్న బోయె మోములు
కదిసి మేను సోఁకితేఁ గళ రేఁగెరా
వెదకి నీవు నేనూ శ్రీవెంకటనాథ కూడఁగా
మదిలోని మచ్చికలు మక్కళించెరా