ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 13-3 ముఖారి సం: 10-074
పల్లవి:
ఎక్కడి పరాకుననో యిందాఁకా నుండెఁ గాక
మక్కువ నాపై బత్తి మానలేఁడె వాఁడు
చ. 1:
పాయరాని వలపులు పక్కనఁ దలఁచుకొంటే
రాయా మనసు గరఁగ కేమే
వో యమ్మలాల నావుంగరము చూపరమ్మ
వేయేల తా నిప్పుడే విచ్చేసీ నీడకే
చ. 2:
వూనినట్టిసరసాలు వూహించుకొంటేను
మానా దేహము తమకించ కేమే
మానినులాల వొక్కమాఁట విన్నవించరమ్మ
తానె వచ్చి నన్నుసంతస మందించీనే
చ. 3:
నేదదేరే చనవులు చిత్తమునఁ దగిలితే
దూదేవయ సేమి వూదితేఁ బోను
ఆదెస మండెమురాయఁ డైన శ్రీవెంకటనాథుఁ
డాదరించి నన్నుఁ గూడె నతివమోహముననూ