Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 13-1 దేసాళం సం: 10-072

పల్లవి:

చాలు లేరె మీ రేల చక్కటులు చెప్పేరె
మేలు గలవారికి మెచ్చకుండఁ జెల్లునా

చ. 1:

వలచినవాఁ డైతె వద్దికి తా వచ్చుఁ గాక
అలిగి తా నెడమాఁట లాడించునా
చెలిమే కలిగితేను సిగ్గుపడవలెఁ గాక
వొలసీనొల్లముతో నూరకుండఁ జెల్లునా

చ. 2:

ప్రియమే కలిగితేను పిలువ రావలెఁ గాక
దయ లేక యింతవడి తామసించునా
నయమే కలిగితేను నమ్మించవలెఁ గాక
భయము లే కింతవడి పట్టెడఁ జెల్లునా

చ. 3:

ఆసలే కలిగితేను అలముకోవలెఁ గాక
యీసున మరి యెగ్గు లెంచఁ జెల్లునా
వేసాలు మాని నన్ను శ్రీవెంకటనాథుఁడు గూడె
వాసు లెంచి యాతఁ డిఁక వాదించఁ జెల్లునా.